ఇండియా వెస్టిండీస్ రెండో వన్ డే విశాఖలోనే!
భారత్, వెస్టిండీస్ మధ్య జరిగే రెండో వన్డేకు విశాఖపట్నం ఆతిథ్యం ఇవ్వనుంది. బీసీసీఐ బుధవారం ఈ విషయం స్పష్టం చేసింది. ఇండోర్‌లో అక్టోబర్ 24న ఈ మ్యాచ్ జరగాల్సి ఉంది. కాంప్లిమెంటరీ పాస్‌ల విషయంలో మధ్యప్రదేశ్ క్రికెట్ సంఘం, బీసీసీఐ మధ్య వివాదం చోటుచేసుకోవడంతో ఆతిథ్యం విశాఖకు దక్కింది. ‘భారత్, వెస్టిండీస్ మధ్య జరిగే రెండో వన్డేకు విశాఖపట్నంలోని డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఏసీఏ-వీడీసీఏ క్రికెట్ స్టేడియం ఆతిథ్యం ఇస్తోంది’ అని బీసీసీఐ ఓ ప్రకటనలో తెలిపింది.
బీసీసీఐ కొత్త రాజ్యాంగం ప్రకారం స్టేడియంలోని టికెట్లలో 90 శాతం విక్రయానికి ఉంచాలి. దాంతో కేవలం 10 శాతం కాంప్లిమెంటరీ టికెట్లు మాత్రమే రాష్ట్ర సంఘాలకు ఉంటాయి. ఇండోర్‌లోని హోల్కర్ స్టేడియం సామర్థ్యం 27,000 కావడంతో 2,700 కాంప్లిమెంటరీ పాస్‌లు అందుబాటులో ఉన్నాయి. ప్రకటనదారుల కోసం బీసీసీఐ సైతం కాంప్లిమెంటరీ కోటాలో వాటా కోరుతోంది. ఇందుకు ఎంపీసీఏ అంగీకరించకపోవడంతో వేదికపై సందిగ్ధం నెలకొంది. చివరికి విశాఖకు అవకాశం దక్కింది.