ICL vs IPL Full Story


 

మన దేశంలో ప్రతి సంవత్సరం జరిగే ఐపీఎల్ ప్రపంచవ్యాప్తంగా చాలా ప్రాచుర్యం పొందింది. ఇందులో ప్రపంచ క్రికెట్ లో ప్రతిభావంతమైన ఆటగాళ్లు పాల్గొనడం వల్ల ఈ కాష్ రిచ్ లీగ్ కు మరింత పేరు వచ్చింది. బీసీసీఐ ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహించే ఈ ఐపీఎల్ రావడానికి ప్రధాన కారణం ఐసీఎల్ . ఇండియన్ క్రికెట్ లీగ్ గా పిలవబడే ఈ లీగ్ ఐపీఎల్ కంటే ముందే ప్రారంభమయింది. దీని గురించి పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.


BCCI ప్రపంచంలోనే అత్యంత ధనిక క్రికెట్ బోర్డు అని తెలిసిందే. టీం ఇండియా ఆడే మ్యాచ్ ల ప్రసార హక్కులను విక్రయించిన డబ్బుతో బీసీసీఐ ఖజానాకి భారీ మొత్తంలో డబ్బు వచ్చి చేరేది. భారతదేశంలోని టీవీ ఛానెల్‌లు టీం ఇండియా క్రికెట్ ప్రసార హక్కులను పొందేందుకు విపరీతంగా పోటీపడేవి. 


సుభాష్ చంద్ర నేతృత్వంలోని Zee Telefilms గతంలో చాలాసార్లు టీం ఇండియా యొక్క అంతర్జాతీయ మ్యాచ్‌ల ప్రసార హక్కులను పొందేందుకు ప్రయత్నించి అందరికన్నా ఎక్కువ ధరకే బిడ్లు వేసింది, కానీ Zee టీవీ కి అంతర్జాతీయ మ్యాచ్ లను ప్రసారం చేసేంత అనుభవం, సామర్థ్యం లేదని భావించిన BCCI  ప్రసారహక్కులు ఇవ్వకుండా తిరస్కరించింది. Zee Telefilms యజమాని, సుభాష్ చంద్ర, బీసీసీఐ కి బుద్ది చెప్పాలని నిర్ణయించుకున్నాడు.అప్పుడే భారతదేశం యొక్క మొట్టమొదటి దేశీయ T20 ఫార్మాట్, ఇండియన్ క్రికెట్ లీగ్ ని మొదలుపెట్టాడు. అనేక మంది దేశీయ మరియు అంతర్జాతీయ ఆటగాళ్లతో ఒప్పందం  చేసుకోవడం ప్రారంభించాడు. 100 కోట్ల రూపాయల కార్పస్‌ ఫండ్ తో ప్రారంభించబడిన ఈ లీగ్ విజేతకు ఒక మిలియన్ డాలర్లు ఇస్తామని ప్రకటించించాడు. 


ప్రారంభంలో ప్రముఖ క్రికెటర్లు ఇందులోకి రావడానికి మొగ్గుచూపలేదు. కాని క్రమక్రమంగా ప్రముఖ ఆటగాళ్ళు కూడా చేరుతూవచ్చారు. ఇదే క్రమంలో జూలై 24, 2007న వెస్టీండీస్ దిగ్గజం బ్రియాన్ లారా ఈ లీగ్‌లో చేరడం జరిగింది. తరువాత ఇంజమామ్ ఉల్ హక్,మార్వాన్ ఆటపట్టు, క్రిస్ కెయిర్న్స్ వంటి ఆటగాళ్లు కూడా ఈ లీగ్ లో చేరారు. అప్పటి వరకు నేషనల్ క్రికెట్ అకాడమీ కి డైరెక్టర్ గా ఉన్న కపిల్ దేవ్ తో పాటు కిరణ్ మోరే వంటి మాజీ దిగ్గజ ఆటగాళ్లు ఐసీఎల్ బోర్డు లో చేరటంతో బీసీసీఐ ఇరకాటంలో పడింది. దీంతో ఐసీఎల్ ను రెబల్ లీగ్ గా పరిగణించి అందులో ఆడే ఆటగాళ్లను దేశవాళీ మరియు అంతర్జాతీయ క్రికెట్ కు ఎంపిక చేయబోమని ప్రకటించింది. అలాగే మాజీ ఆటగాళ్లు ఈ లీగ్ లో చేరితే వారికి ఇచ్చే పెన్షన్ లాంటి ఇతరత్రా ప్రయోజనాలని కోల్పోతారని ప్రకటించింది.  ఇతర క్రికెట్ బోర్డులు కూడా తమ ఆటగాళ్లు ఐసీఎల్ లో ఆడకుండా ఉండేలా చర్యలు తీసుకోవాలని ఒత్తిడి చేసింది. అంతే కాదు ఐసీఎల్ కు క్రికెట్ స్టేడియంలు కూడా ఇవ్వకుండా ఇబ్బంది పెట్టింది. 


అప్పటి రైల్వే మంత్రి లాలూ ప్రసాద్ యాదవ్ ఐసీఎల్ కు రైల్వేస్ కు చెందిన స్టేడియాలని వాడుకునేలా అనుమతి ఇచ్చారు. ICL యొక్క మొదటి సీజన్ నవంబర్ 2007లో ప్రారంభమైంది.ఈ ఛాంపియన్‌షిప్‌లో ఆరు   జట్లు ఉన్నాయి, అవి భారతీయ మరియు అంతర్జాతీయ ఆటగాళ్లను కలిపి టీంగా ఎంపిక చేసేవి. ఐసీఎల్ లో అంతర్జాతీయ స్టార్లు ఉన్నప్పటికీ, భారతీయ అభిమానుల అంచనాలను అందుకోలేకపోయింది, దీనికి ప్రధాన కారణం భారతీయ సూపర్‌స్టార్లు ఒక్కరు కూడా అందులో పాల్గొనకపోవడం మరియు అన్ని పోటీలను వేర్వేరు వేదికలపై కాకుండా కొన్ని స్టేడియాలలోనే నిర్వహించడం. అప్పటివరకు ఎవరికీ తెలియని ఆటగాళ్ళు తమ తమ జట్లకు అద్భుతమైన ప్రదర్శన చేస్తూ వెలుగులోకి వచ్చారు. అంబటి రాయుడు  వంటి యువ ఆటగాళ్లు ఈ టోర్నీ ద్వారానే వెలుగులోకి వచ్చారు.


ఇంతలో, బీసీసీఐ కూడా ఐసీఎల్ లానే తన స్వంత T20 లీగ్‌ని కూడా ఏర్పాటు చేయడం కోసం ప్రయత్నాలు మొదలు పెట్టింది. లలిత్ మోడీ సారథ్యంలో ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2008లో ప్రారంభమైంది. ఇందులో భారతదేశం యొక్క టాప్  ప్లేయర్‌లందరూ పాల్గొనడంతో మొదటి సీజన్ నుండి విజయాన్ని సాధించింది. రాబోయే సంవత్సరాల్లో IPL ఆటపై భారీ ప్రభావాన్ని సృష్టించబోతోందని అందరికీ అర్థం కావడానికి ఎక్కువ సమయం పట్టదు. IPL యొక్క ప్రజాదరణ ICL మనుగడను మరింత కష్టతరం చేసింది. ఐసీఎల్ 2008 సీజన్ తరువాత ఈ లీగ్ నిలకడలేనిదిగా మారింది. ఆటగాళ్లకు చెల్లింపులు చేయడంలో కూడా జాప్యం జరగడం, బీసీసీఐ ఇప్పటివరకు ఐసీఎల్ ఆడిన ఆటగాళ్లు తిరిగి వస్తే వారిపై ఎటువంటి చర్యలు తీసుకోమని భరోసా ఇవ్వడంతో చాలామంది ఆటగాళ్లు ఐసీఎల్ ను వీడారు. చివరికి ఐసీఎల్ ఒక చరిత్రగా మిగిలిపోయింది.


ఐసీఎల్ టోర్నీలో లోపాలు ఉన్నప్పటికీ, ఈ టోర్నీ వల్ల దేశీయ క్రికెటర్లకు చాలా మేలు జరిగిందనే చెప్పవచ్చు. అప్పటి వరకు ఉన్న మ్యాచ్ ఫీజులను భారీగా పెంచి ఆటగాళ్లు ఆర్థికంగా లాభపడే విధంగా చేయడానికి ఐసీఎల్ కారణమే చెప్పొచ్చు.దీంతో తమ ఆటగాళ్లు వేరే లీగ్స్ వైపు చూడకుండా  బీసీసీఐ ఆటగాళ్లు వేతనాలను సవరించింది. ఐపీఎల్ అనేది ఎంత ప్రాచుర్యం పొందినా దానికి ముఖ్య కారణం ఐసీఎల్ అని చెప్పక తప్పదు.

No comments

Powered by Blogger.