చైనా రహస్య యుద్ధ సన్నాహాలు!

china india faceoff

మన దేశానికి కొరకరాని కొయ్యలా మారిన చైనా మరోసారి కవ్వింపు చర్యలకు దిగుతోంది. టిబెట్‌లో ఉన్న లహసా గోంగ్గర్‌ విమానాశ్రయాన్ని చైనా సైనిక స్థావరంగా మారుస్తున్నట్లు తెలుస్తుంది. విమానాశ్రయ ప్రాంగణ భూగర్భంలో బంకర్లు, బాంబు దాడులను తట్టుకునే విధంగా స్థావరాలను నిర్మిస్తున్నట్లు తెలుస్తోంది. ఇది భారత్‌కు ఆందోళన కలిగించే అంశంగా మారింది. గతంలో మారుమూల ప్రాంతాలకూ అనుసంధానం పెంచాలనే ఉద్దేశంతో విమానాశ్రయం నిర్మించినట్లు చెప్పిన చైనా ఇప్పుడు దాన్ని  ఏకంగా సైనిక స్థావరంగా మార్చడం గమనార్హం.

ఇప్పటికే భారత్‌, చైనాల మధ్య సంబంధాలు అంతంతమాత్రంగా ఉన్న సంగతి తెలిసిందే. అయితే ఇటీవల భారత ప్రధాని నరేంద్ర మోదీ చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌తో అనధికారికంగా సమావేశమైన తర్వాత కాస్త మెరుగు పడ్డాయి. కానీ చైనా తాజా చర్యలతో మరింత దిగజారే పరిస్థితి ఏర్పడింది. డోక్లాం విషయంలో గత ఏడాది ఇరు దేశాలు ఓ ఒప్పందానికి వచ్చిన సంగతి తెలిసిందే. కాగా ఇప్పుడు మరో వివాదం మొదలయింది. భారత్‌కు సమీపంలో ఉన్న విమానాశ్రయాన్ని సైనిక స్థావరం మాదిరిగా ఉపయోగించుకునేలా ఏర్పాట్లు చేస్తూ భారత్‌ను కవ్విస్తోంది. యుద్ధం తరహా పరిస్థితులు ఉన్నప్పుడే ఈ స్థావరాల్లో సైనికులను సురక్షితంగా ఉంచి దాడులు చేపడుతుంటారు. సాధారణంగా చైనా వైమానిక దళానికి రష్యాతో సరిహద్దులో ఇలాంటి స్థావరాలు ఉన్నాయి. ఇప్పుడు టిబెట్‌ అటానమస్‌ రీజియన్‌లో భారత్‌కు సమీపంలో ఇలాంటి నిర్మాణాలు చేపట్టడం ఆందోళన కలిగించే పరిణామమే.

చైనా చర్యలపై భారత భద్రతా అధికారులకు ఇప్పటికే సమాచారం అందినట్లు తెలుస్తోంది. చైనా రక్షణ మౌలిక సదుపాయాలను పెంచుకుంటున్నట్లు తెలుస్తోంది, భారత్‌ కూడా ఎలాంటి చర్యలకైనా దీటుగా బదులిచ్చేలా సదుపాయాలు ఏర్పాటు చేసుకోవాలని భారత రక్షణ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. కాగా చైనా బంకర్లను నిర్మించే అంశంపై భారత్‌లోని చైనా దౌత్య కార్యాలయాన్ని ప్రశ్నించగా ఎలాంటి స్పందన లేదు.


Powered by Blogger.