కౌశల్ పై సంచలన వ్యాఖ్యలు చేసిన శివ బాలాజీ భార్య
ఒక వ్యక్తి సెలబ్రిటీ స్టేటస్ కి ఎదిగాడంటే పూలవానతో పాటు రాళ్లదెబ్బలు తగులుతూ ఉంటాయి. ఇది జగమెరిగిన సత్యం. స్మార్ట్ ఫోన్ ప్రతిఒక్కరి అరచేతిలోకి చొచ్చుకెళ్లిన తరువాత సామాజిక మాధ్యమాలు ద్వారా ఇతరుల జీవితాలలోకి తొంగిచూడటం, అనవసర వివాదాల్లోకి వ్యక్తులను లాగడం చాలా సులభంగా మారింది. అలాంటి బురదకి దూరంగా ఉండటం సెలెబ్రిటీలు చేయాల్సిన కర్తవ్యం. అలా ఉండకపోతే వివాదాలు ఎలా తలెత్తుతాయి అనేదానికి నిన్న జరిగిన విషయం అసలైన సాక్ష్యం. సోమవారం రోజున ట్విట్టర్ లో జరిగిన సందర్భాలు, ఈ సందర్భంగా శివబాలాజీ భార్య మధుమిత కౌశల్ గురించి, కౌశల్ భార్య గురించి చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. ఆ వ్యవహారం మీ కోసం.
కౌశల్ ని వ్యతిరేకించే వ్యక్తి, శివబాలాజీ ని ట్యాగ్ చేస్తూ, ఇతరులను కిందకు లాగకుండా ఎలా బిగ్ బాస్ ని గెలవాలో మీరు చూపించారు అని పోస్ట్ పెట్టాడు. ఈ పోస్ట్ కి శివబాలాజీ స్పందిస్తూ " మీరు నన్ను ఆ దృష్టితో చూసినందుకు చాలా బాగుంది. మీ మెసేజ్ కు ధన్యావాదాలు " అని శివ బాలాజీ సమాధానం ఇచ్చాడు. రాజు రెండో భార్య మంచిది, అంటే మొదటి భార్య మంచిది కాదు అనే సామెత తెలుగు లో ఉంది కదా. ఈ సామెతకు అనుగుణంగా కొంత మంది కౌశల్ అభిమానులు శివ బాలాజీ ఇచ్చిన సమాధానానికి నొచ్చుకున్నారు. అంటే కౌశల్ ఇతరులను కిందకు లాగాడని శివ బాలాజీ ఒప్పుకుంటున్నాడా, శివబాలాజీ ట్వీట్ లో పరమార్థం ఏంటి అంటూ శివ బాలాజీ ని ప్రశ్నిచడం మొదలుపెట్టారు
అందరి అభిమానుల్లో ఎలా అయితే నోరుజారే వ్యక్తులు ఉంటారో, కౌశల్ అభిమానుల్లో కూడా కొంత మంది ఆవేశంలో అలా చేసే వాళ్ళు ఉన్నారు.
అలాంటి ఒక అభిమాని కౌశల్ ని పొగుడుతూ శివ బాలాజీ ని తక్కువ చేస్తూ, కొద్దిగా కించపరిచేలా ఒక పోస్ట్ పెట్టాడు.
ఆ వ్యక్తి పెట్టిన పోస్ట్ కి శివబాలాజీ భార్య మధుమిత బదులిస్తూ " మీ నోరు అదుపులో పెట్టుకోండి. ఇప్పడు మీరు మీ తలని ఎక్కడ పెట్టుకుంటారు. మీ హీరో దగ్గరకు వెళ్లి అసలు నిజం కనుక్కోండి. ఏమి తెలియకుండా ఇలాంటి వ్యాఖ్యలు చేసినందుకు సిగ్గుపడండి. బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్ళకముందు శివబాలాజీ తో కౌశల్ రెండు గంటల పాటు మాట్లాడాడు.
శివ నిజంగానే ద్వేషిస్తే కౌశల్ తో ఎందుకు అంతసేపు మాట్లాడుతాడు, కౌశల్ కు సూచనలు ఎందుకు చేస్తాడు.రోజులోని ఎలాంటి సమయంలోనైనా నీలిమ తో గంటలు గంటలు మాట్లాడేదాన్ని. మన మనుషులు బిగ్ బాస్ హౌస్ లో ఉన్నప్పుడు ఆ కుటుంబం పడే ఆవేదన ఏంటో నాకు తెలుసు. బయట ఎలావుండాలి అనే విషయమై నేను ఆమెకు సూచనలు చేసాను. ఆమెను ఇంతకముందు నేను ఎప్పుడు కలవలేదు, ఆమె ఎవరో కూడా నాకు తెలియదు. కానీ, వాళ్ళను మేము అర్థం చేసుకున్నాము, సహాయం చేసాము. ఇవన్నీ శివ బాలాజీ బయటకు చెప్పొద్దు అని చెప్పాడు. కానీ, మీరందరూ అనవసరంగా వేరొకరితో శివబాలాజీ ని పోలుస్తున్నారు, అసలు శివ బాలాజీ ఎందుకు పనిరాడు అన్నట్లు మాట్లాడుతున్నారు. అది మాకు నచ్చడం లేదు. మీ ప్రేమను మీకు నచ్చిన వారి ఫై వ్యక్తపరిచే క్రమంలో అది ఇతరులను బాధపెట్టకూడదు" అని ముగించారు మధుమిత.
మరి ఈ మొత్తం వ్యవహారం లో ఎవరిదీ తప్పు అనే విశ్లేషణ చేస్తే, పెనం వేడిగా ఉన్నప్పుడు అట్టు వేయాలి కానీ, ముట్టుకోకూడదు. కౌశల్ కి ఇప్పుడు క్రేజ్ చాలా పీక్ లో ఉంది. ఈ క్రేజ్ ఎంత కాలం ఉంటుంది అనేది భవిష్యతులో తెలుస్తుంది, కానీ, ఈ సమయంలో కౌశల్ గురించి చిన్న విషయమైనా, అక్కడ విషయం లేకపోయినా అతిగా స్పందించే అభిమానులు ఒక పదిశాతం ఉంటారు. ఆ పదిశాతాన్ని గిల్లే కౌశల్ యాంటీ ఫాన్స్ కూడా ఉంటారు. ఇక్కడ జరిగింది అదే.
కౌశల్ అంటే నచ్చని వ్యక్తి శివ బాలాజీ ని పొగుడుతూ, పరోక్షంగా కౌశల్ ని కిందకులాగుతూ శివ బాలాజీ ని మధ్యలోకి లాగాడు. శివ బాలాజీ అందుకు స్పందించాడు. " శివ బాలాజీ అలా స్పందించడం మాకు నచ్చలేదు, అంటే కౌశల్ ఇతరులను కిందకు లాగాడని శివ బాలాజీ ఒప్పుకుంటున్నాడా, అసలు మిగతా వాళ్ళే కౌశల్ ని కిందకు లాగాలని ప్రయత్నించారు " అంటూ కొంతమంది కౌశల్ అభిమానులు అతిగా స్పందించారు. ఇక్కడ కొంతమంది కౌశల్ అభిమానులు చేసింది వందశాతం తప్పే. అలా ఏ అభిమాని చేయకూడదు. ఎందుకంటే ప్రతి ఒక్కరికి ఆత్మాభిమానం ఉంటుంది.కానీ, ఆ తరువాత శివ బాలాజీ భార్య మాధవి, శివ బాలాజీ వద్దు అని చెప్పినా కౌశల్ కు, అతని భార్య కు తాము ఏమి చేసాము అనే విషయాన్ని చెబుతూ, వాలెవరో మాకు తెలియక పోయిన చాలా చేసాము అంటూ కొద్దిగా ఘాటుగా స్పందించింది. మాధవి ఇలా స్పందించడం కొంత మందికి నచ్చలేదు. కౌశల్ గాని, నీలిమ గాని శివ బాలాజీ, మధుమిత గురించి చెడుగా మాట్లాడలేదు.
కానీ, మాధవి మాత్రం కౌశల్ కి, కౌశల్ భార్య నీలిమ కు బిగ్ బాస్ విషయమై తాము చాలా చేసాము అని అర్థం వచ్చేలా మాట్లాడింది, కొద్దిగా అభిమానులను రెచ్చగొట్టే ధోరణిలో పోస్ట్ పెట్టింది.అలా కాకుండా శివ బాలాజీ, కౌశల్ మంచి మిత్రులు మీరు అనవసరంగా మీ మాటలతో ఇద్దరి మధ్య మనస్పర్థలు సృష్టించకండి అని మాధవి పోస్ట్ పెట్టి ఉంటే మరింత హుందాగా ఉండేది. మాధవి పెట్టిన పోస్ట్ నిప్పు రవ్వను, అగ్నిగోళం లా వ్యాప్తి చేసేలా ఉంది కానీ, చల్లార్చేలా లేదు.
అభిమానికి ఆవేశం ఉంటుంది, సెలబ్రిటీ కి ఆలోచన ఉండాలి. సెలబ్రిటీ కూడా ఆవేశపడితే ఎలా అనేదే ఇప్పుడు ప్రశ్న.
మరొక ఆసక్తికర అంశం ఏంటంటే, వివాదాస్పదంగా ఉన్న ట్వీట్స్ ని శివ బాలాజీ తన టైం లైన్ లో పోస్ట్ చేసి మరి సమాధానం ఇస్తున్నాడు. శివ బాలాజీ ఇలా ఎందుకు చేస్తున్నాడు అనేది మాత్రం అర్థం కావడం లేదు. ఇలా చేయడం వల్ల కొంత మంది కౌశల్ అభిమానులు కావచ్చు, లేదా కౌశల్ అభిమానులు అనే ముసుగులో ఉండే కౌశల్ వ్యతిరేకులు కూడా కావొచ్చు ఈ వ్యవహారాన్ని మరింత పెద్దదిగా చేసే ఆస్కారం ఉంది, అవి కాస్తా వివాదాలుగా మారుతాయి.కౌశల్ అభిమానులు కూడా అనవసరంగా ఇష్టమొచ్చినట్లు నోరు పారేసుకోకుండా ఉంటే చాలా బాగుంటుంది. అలా ఉంటేనే కౌశల్ ని నిజంగా అభిమానిస్తున్నట్లు అర్థం, అలా గనుక లేకపోతే కౌశల్ కే నష్టం. సెలబ్రిటీ లు కూడా ఆవేశాలకు పోకుండా, హుందాగా వివాదాలను తగ్గించే విధంగా స్పందిస్తే సామాజిక మాధ్యమాల్లో మరింత ఆరోగ్యకరమైన వాతావరం ఉంటుంది.