సొంతిల్లు లేకపోతే.. 5 వేలు అద్దె ఇస్తాం:బీజేపీ


రాష్ట్రంలో ప్రతి కుటుంబానికి సొంతింటి కలను నిజం చేస్తామని బీజేపీ ప్రకటించింది. ఆ కల సాకారమయ్యే వరకు ప్రతి నెలా రూ.5 వేలకు మించకుండా ఆయా కుటుంబాలకు ఇంటి అద్దె చెల్లిస్తామని వెల్లడించింది. ఈ మేరకు తమ ఎన్నికల మేనిఫెస్టోలో పొందుపరుస్తున్నట్లు తెలిపింది. బీజేపీ అధికారంలోకి వస్తే అమలు చేయనున్న కొన్ని హామీలను ఆ పార్టీ సోమవారం ప్రకటించింది. హైదరాబాద్‌లోని పార్టీ కార్యాలయంలో జరిగిన పార్టీ మేనిఫెస్టో కమిటీ వివిధ అంశాలపై చర్చించి ఏకాభిప్రాయానికి వచ్చింది. వాటిని పార్టీ ఉన్నతస్థాయి కమిటీకి నివేదించాలని నిర్ణయించింది. అంతేకాదు ఏకాభిప్రాయం వచ్చిన అంశాలను మేనిఫెస్టోలో పొందుపరచనున్నట్లు ప్రకటించింది.

ప్రస్తుత టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ప్రకటించిన డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇళ్లు ఎండమావిగా మారాయని పేర్కొంది. కేంద్రం ప్రకటించిన ప్రధానమంత్రి ఆవాస్‌ యోజనను అమలు చేయకుండా రాష్ట్ర ప్రభుత్వం నీరుగార్చిందని తెలిపింది. అందుకే తాము అధికారంలోకి వస్తే డబుల్‌ బెడ్‌రూమ్‌ పథకాన్ని కొనసాగిస్తూనే కేంద్రం ప్రవేశపెట్టిన ప్రధానమంత్రి ఆవాజ్‌ యోజనను కచ్చితంగా అమలు చేస్తామని తెలిపింది.

సమావేశం అనంతరం ఆయా అంశాలను పార్టీ అధ్యక్షుడు లక్ష్మణ్, మేనిఫెస్టో కమిటీ చైర్మన్‌ ఎన్వీఎస్‌ఎస్‌ ప్రభాకర్‌ వెల్లడించారు. మరిన్ని అంశాలపై మంగళవారం కూడా చర్చించాలని నిర్ణయించినట్లు పేర్కొన్నారు. మొత్తానికి ఈ నెల 15 నాటికి బీజేపీ మేనిఫెస్టో రూపకల్పనను పూర్తి చేసి, ప్రజల ముందుకు తీసుకురానున్నట్లు వివరించారు. సమావేశంలో మేనిఫెస్టో కమిటీ కన్వీనర్‌ మల్లారెడ్డి, సభ్యు లు ప్రొఫెసర్‌ వైకుంఠం, వైఎల్‌ శ్రీనివాస్, జగదీశ్వర్, రిటైర్డ్‌ ఐఏఎస్‌ అధికారి దాసరి శ్రీనివాస్, ఎస్‌.కుమార్, సిద్దాగౌడ్, మాధవిచౌదరి, రాకేశ్‌ రెడ్డి, కరుణగోపాల్, ప్రభోదిని, సుభాషిణి పాల్గొన్నారు.

Powered by Blogger.